సాక్షి, రంగారెడ్డి : పుట్టిన రోజు పార్టీలో ఈవెంట్ మేనేజర్ (మహిళ)ను నగ్నంగా నృత్యం చేయాలని వేధించిన నిందితులపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ అశోకచక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 202 సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అమీర్ తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. వ్యాపారి అయిన అమీర్ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం రాత్రి నిర్వహించారు. ఇందుకు రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళా ఈవెంట్ మేనేజర్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ మహిళ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో తమకు మహిళా డ్యాన్సర్ కావాలంటూ అమీర్, రాజావలీ, సుల్తాన్ సలీంలు కోరారు.
ఇందుకు ఈవెంట్ మెనేజర్ తమ వద్ద నృత్యం చేసే మహిళలు లేరంటూ వెల్లడించారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఈవెంట్ మేనేజర్‌ను నువ్వే నగ్నంగా నృత్యం చేయాలంటూ వేధించారు. వినకపోవడంతో రూమ్‌లో బంధించి చిత్రహింసలు పెట్టారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వారి నుంచి తప్పించుకున్న ఆ మహిళ ఇంటికి వెళ్లి విషయాన్ని భర్తకు తెలిపింది. భార్యాభర్తలు ఉదయం రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈవెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్లగా అప్పటికే ఇంటికి తాళం వేసి ఉంది. ముగ్గురు యువకుల సెల్‌ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ చేసి ఉన్నాయి. బర్త్‌డే పార్టీకి ఎవరెవరు వచ్చారన్న విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ అశోకచక్రవర్తి తెలిపారు.